పండు వెన్నెల పంచుతు,
రేయి మెల్లగ గడుపుతు
గడుసు తారల నడుమ
అందముగా భాసించు చంద్రుని
హనుమ చూసెను గగన తలమున 1
ఆటు పోటుల కారకుడును
కారు చీకటి కడుగువాడును
తెల్ల కాంతితో మెరయు వాడును
అగు చంద్రుని ఆకసమందున హనుమగనెను 2
మందర గిరిపై వెలుగు మెరుపులు
సంధ్యా సమయపు చల్ల గాలులు
కమలములనుండి వచ్చెడి గంధము
అంతటి ఆనందము, అందము నిగిన చూసెను 3
వెండి పంజరమున రాయంచ మెదులు నట్లు
మందర గుహలో సింగము కదులు నట్లు
మత్త గజముపై వీరుడు సాగునట్లు
నింగిన చంద్రుడు ఠీవిగ పోవుచుండెను 4
తెల్లని పర్వతపు శిఖ లెగిరినట్లు
బంగారు దంతముల ఐరావతము వలెను
బుసకొట్టు కోపు కొమ్ముల దున్న వలెను
పున్నమి చంద్రుని మచ్చ భాసించెను 5
గ్రహణము వీడి వెలుగు వ్యాపించినట్లు
మృగరాజు విశ్రాంతికి సమతలము దొరికినట్లు
గజేంద్రుడు మదించి సమరమున ఉప్పొంగినట్లు
రారాజు గెలిచి రాజ్యమును వెలుగొందునట్లు
గగన తలమున చంద్రుడు వెల్లి విరిసెను 67
ప్రియుని నవ్వుతో ప్రియురాలి కోపము పొయినట్టు
మాంస భక్షణతొ మలినమయిన
రాక్షస మనములు తుడిచినట్లు
పండు వెన్నెల చీకట్లను తుడుచుచుండెను 8
వీనుల విందుగ వీణానాదము
పతుల చెంతన సతుల గానము
వెన్నెల రాత్రిలో పిసాచ చలనము
నడిఝామునా నిదురెరుగని లంకా నగరము 9
రధులు, రధములు, గజములు,
ముత్యము, మణుల విలువలతో
నిండిన గంధపు మంటల వెచ్చని ఇండ్లను
అచ్చెరువొందుతు మారుతి చూసెను 10
తాగిన మత్తులొ తూలుతు కొందరు
పక్కన వారిని తిట్టుతు కొందరు
అటునిటు పడుతూ తిరుగుతు కొందరు
ఎవరో ఒకరిని కొట్టుతు కొందరు 11
స్త్రీల వక్షము నొక్కుచు కొందరు
వారిపై చేతులు వేయుచు కొందరు
సభ్యత చచ్చిన లంకా నగరపు
పౌర సమూహమును హనుమ చూసెను 12
కొందరు నిద్రలొ మునిగిన వనితలను
గంధపు లేపన చేసెడి స్త్రీలను
సుందరముగా నవ్వెడి ఉవిదలను
మంద్రముగా పాడెడి కోవిదులను
హనుమ చూసెను అస్చర్యముతో 13
ఏనుగు ఘీంకారములతోను
గుర్రపు సెకలింపులతోను
మల్లుల రోషపు బుసలతోను
లంకా నగరము నిండి ఉండెను 14
విజ్ఞులు, ప్రాజ్ఞులు నిండిన వీధులు
వక్తలు, భక్తులు కూడిన పధములు
వీరులు, సూరులు నడిచెడి దారులు
హనుమ తిరిగెను ఒక్కటి వదలక 15
అందములో చంద్రుని సములు
గుణముల పుట్టలు కొందరు పౌరలు
వారిని చూచుచు ఆనందించెను
క్రూరులూ వికృతులనూ చూసెను 16
ప్రావీణ్యము కల వనితలు
నైపుణ్యము కల ఇంతులు
తారా కాంతితో కొందరు
సారా మత్తుతో కొందరు
ముందుకు సాగుచు హనుమ చూచు చుండెను 17
దివ్య కాంతితో వెలుగుతు కొందరు
రాత్రి క్రీడల నడుమన కొందరు
ప్రియుని కౌగిలి బిగువున కొందరు
పూల మాలలతో నిండిన కొందరు 18
ప్రియుని వడిలో కులికెడి కొందరు
రతి క్రీడలో మునిగిన కొందరు
పతిపై భక్తితో మెలిగెడి కొందరు
కాముడు నిండిన మదితో కొందరు 19
వలువలు వూడిన వనితలు కొందరు
సుందర చాయతో మెరిసెడి కొందరు
ప్రియుని కొరకై వగచెడి కొందరు
కేళికి సిద్ధమై నిలచిన కొందరు 20
ప్రియుని రాకతో గెంతెడి కొందరు
మాలికలతో స్వాగత మిచ్చెడి కొందరు
అతని చేశ్ఠలకు మురిసెడి కొందరు
ఆనదపు అనుభూతులలో తేలెడి కొందరు 21
ఆనందముతో చంద్రుని వలే
మెరిసెడి ముఖ పంక్తులను
ఆభరణ కాంతులతో విప్పారిన కన్నులను
హనుమ చూచుచూ ముందుకు సాగు చుండెను 22
మానస పుత్రికయు, సున్నితయు
జనక సుతయు, పతివ్రతయు నగు
సీత మాత్రము హనుమకు కనబడ కుండెను 23
స్రీ రాముని మనమున నిలిపినదియు
సాధ్వియు, పతివ్రత పరంపరకు చిహ్నమునగు
సీత మాత్రము హనుమకు కనబడ కుండెను 24
రాముని ఎడబాటుకు కృగినదియు
హృదయము కన్నీటితో నిందినదియు
సుందర వదనము సుస్వరము కలదియునగు
సీత మాత్రము హనుమకు కనబడ కుండెను 25
నివురుగప్పిన మంచి నిప్పు వలెను
దుమ్ముగప్పిన బంగారు గీత వలెను
గాలికి చెదిరిన మేఘ పంక్తి వలెనుండు
సీత మాత్రము హనుమకు కనబడ కుండెను 26
మానస పుత్రిక పావని సీతను
జనక నందన జానకి మాటను
రాముని ప్రియసతి, రావణ అపహర్తను
కానక మారుతి వగచెను పరి పరి విధముల 27
Wednesday, January 3, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment